ట్రక్కు నిండా గులాబీలు పంపాడు: నటి

ముంబై: తన కెరీర్‌ ప్రమాదంలో పడుతుందన్న భయం కారణంగానే పెళ్లి విషయాన్ని కొన్నాళ్లపాటు దాచిపెట్టానని బాలీవుడ్‌ ప్రముఖ నటి జూహీ చావ్లా తెలిపారు. తనను అత్యంత జాగ్రత్తగా చూసుకునే వ్యక్తే తనకు భర్తగా దొరికారని మురిసిపోయారు. అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే జూహీ చావ్లా తన వ్యాపారవేత్త జై మెహతాను రహస్యంగా వివాహమాడిన సంగతి తెలిసిందే. జై మెహతా మొదటి భార్య మరణించిన దాదాపు ఆరేళ్ల తర్వాత వీరిద్దరి పెళ్లి జరిగింది. కాగా ఇటీవల రాజీవ్‌ మసంద్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూహీ చావ్లా తన పెళ్లి నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.




‘‘సినిమాల్లో ప్రవేశించకముందే నాకు జైతో పరిచయం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల చాలాకాలం పాటు కలుసుకోలేదు. కొన్నేళ్ల తర్వాత మా ఇద్దరి స్నేహితుడు ఒకరు ఏర్పాటు చేసిన డిన్నర్‌ పార్టీలో మరోసారి తనను చూశాను. అప్పటికే ఆయన సుజాత బిర్లా(జై మొదటి భార్య)ను కోల్పోయారు. విమాన ప్రమాదంలో 1990లో ఆమె మరణించారు. తర్వాత కొన్నేళ్లకు నేను షూటింగ్‌లో ఉన్న సమయంలో మా అమ్మ మోనా చావ్లా యాక్సిడెంట్‌లో చనిపోయారనే దుర్వార్త విన్నాను. నా జీవితంలో అతి అత్యంత కఠిన సమయం. సర్వం కోల్పోయినట్లు అనిపించింది.