హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విధుల్లో ఉన్న ఉద్యోగులందరూ మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు కూడా మాస్క్‌లు పెట్టుకోవాల్సిందేనని సూచించింది. కాగా బయట దొరికే మాస్కులతో పాటు ఇళ్లలో తయారు చేసిన మాస్క్‌లను కూడా ధరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాస్కువేసుకోవాలని తెలిపింది. కాగా ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్‌లు పెట్టుకోకుంటే అరెస్టుతో పాటు జరిమానా కూడా విధిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు వాటి జాబితాలో తెలంగాణ కూడా చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 471 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 12కు చేరుకుంది.
తెలంగాణలో ఇక మాస్క్‌లు తప్పనిసరి